AP Volunteer is best or not

వాలంటీర్ ఎందుకు దండగ అనే వారికి చెప్పు దెబ్బ లాంటి స్ఫూర్తిదాయక ఆర్టికల్.

#గేటు

మధ్యాహ్నం ఒంటి గంట , బయట ఎండ చుర్రుమంటుంది . ఎండకి భయపడ్డ ఎర్ర కుక్క వీధి మూలన చెట్టు కింద కాళ్ళు ముడుచుకు పడుకొంది .
రెడ్ జోన్ కావటాన కరోనా భయంతో జనాలు ఇంట్లో నుండి కాళ్ళు బయట పెట్టకుండా ముడుచుకు పడుకున్నారు .

 గేటు దగ్గరనుండి “అన్నా” అనే పరిచయం అయిన పిలుపు విని బయటికి చూసా . బడే(అసలు పేరు తెలీదు) అనే ముస్లిం అమ్మాయి మా వార్డ్ వలంటీర్ . ఇటీవలి కాలంలో తరుచూ మా ఇంటికొస్తుంది . పై ఇంట్లో వైట్ కార్డ్ వాళ్లతో రొటీన్ వర్క్ అయ్యాక కాసేపు మా ఆవిడతో కబుర్లు చెప్పి వాటర్ తాగి వెళుతుంది . 

 నేను గేటు తీయలేదు యాభై ఇల్లు తిరిగి వస్తుంది . ఎందుకొచ్చిన రిస్క్ అనుకొని “ఏంటమ్మా చెప్పు” అన్నా ఇంట్లోనుండే .

అన్నా రెడ్ జోన్ కదా ఇహ ఇంట్లో నుండి అస్సలు బయటకి రాకూడదు . ఉదయం ఫ్రీ టైం కూడా తీసేసారు . సరుకులు , పాలూపెరుగూ , మెడిసిన్ ఎం కావాలన్నా స్లిప్ రాసి వాట్సాప్ చేయండి . డబ్బులు కూడా కాష్ కాకుండా వీలైతే ‘గూగుల్ పే , ఫోన్ పే’ చేయండి ,సాయంత్రం తెచ్చిస్తాను” . 

“అన్నీ ఉన్నాయమ్మా ఎం వద్దు” ,

“సరేన్నా , ఏమైనా అవసరమైతే కాల్ చేయండి . అన్నీ ఒకేసారి రాసి చెప్పండి” అని వెళ్ళిపోయింది . మళ్లీ ఏడింటికి “అన్నా” అనే పిలుపు .

 ఈ పిల్లకి పనీపాటా లేదనుకొంటూ పైకి మర్యాదగా “ఏంటీ” అన్నా ఇంట్లో నుండే .

 హ్యాండ్ గ్లవుజ్ ఉన్న చేత్తో బాగ్ లోంచి ఓ చిన్న బాటిల్ తీసి గేటు గోడ మీద పెట్టింది . 
“కరోనాకి హోమియో మెడిసిన్ ఇచ్చారన్నా , ఇక్కడ గోడ మీద పెడుతున్నా తీసుకోండి , నువ్వూ వదిన ఆరు పిల్స్ చొప్పున మూడు సార్లు వేసుకొండి . ఆగస్త్యకి నాలుగు పిల్స్ చొప్పున వేయండి” అని చెప్పి ఇంకోమాట మాట్లాడేలోపే వెళ్ళిపోయింది . 

 నేను లోపలుండి గేటు తీయలేదు నా కుటుంబం కోసం . తను ఆడపిల్లై ఉండి తన మీద ఉన్న బాధ్యత కోసం తన కుటుంబంతో పాటు తను బాధ్యత వహించిన కుటుంబాల కోసం యాభై గేట్ల ముందు నిలబడి కాపు కాస్తుంది . సిగ్గనిపించింది కానీ గేటు తీసి రామ్మా అని పిలవలేని పరిస్థితులు .


 రేపు ఓ ఎక్స్ ట్రా టీ పెట్టాలి , గేటు తీయాలి , సోషల్ డిస్టన్స్ , సానిటైజ్ రూల్స్ పాలో అవుతూ బడే(పెద్ద మనసు) నవ్వుతూ చెప్పే కబుర్లు కొంచెం సేపు మా యావిడతో పాటు నేనూ వినాలి .

Leave a Comment

error: Content is protected !!